కమల్‌ త్రిష జంటగా కొత్త చిత్రం

రెడ్‌జయింట్‌ మూవీస్‌ పతాకంపై కమల్‌హాసన్‌, త్రిష, మాధవన్‌, సంగీత ప్రధాన తారాగణంగా ఓ చిత్రం రూపొందుతోంది. ఉదయానిధి స్టాలిన్‌ నిర్మాతగా కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. చెన్నరులో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో దర్శకుడు కె.ఎస్‌.రవికుమార్‌ మాట్లాడుతూ...కమల్‌ హీరోగా తాను ముంబరు ఎక్స్‌ప్రెస్‌, తెనాలి, పంచతంత్రం, దశావతారం చిత్రాలు తీసానని, తమ కాంబినేషన్‌లో ఇది ఐదవ చిత్రమని అన్నారు. కమల్‌తో పనిచేయడం ద్వారా ఎన్నో తెలియని విషయాలను నేర్చుకోవచ్చన్నారు. దర్శకుడిగా తాను ఉన్నప్పటికీ కమల్‌ అన్ని విభాగాలనూ పరిశీలిస్తారని అన్నారు. ఆయన్ని ఒక టీచర్‌గా తాను భావిస్తానని అన్నారు. 30 ఏళ్ల యువకుడిలా కమల్‌ ఈ చిత్రంలో కనపడతారని అన్నారు. రొమాంటిక్‌, కామెడీ అంశాలతో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా వుంటుందన్నారు. మలేషియా, స్పెయిన్‌, యూరప్‌, ఇటలీ, ఫ్రాన్స్‌ దేశాలలో 90 శాతం షూటింగ్‌ ఉంటుందన్నారు. జూన్‌ రెండవ వారంలో పారిస్‌లో చిత్ర షూటింగ్‌ ప్రారంభం అవుతుందన్నారు. ఈ చిత్రానికి దేవీశ్రీప్రసాద్‌ సంగీతాన్ని అందిస్తున్నారని తెలిపారు. ఈ సమావేశంలో కమల్‌హాసన్‌ మాట్లాడుతూ...ఈ చిత్రం అందరినీ అలరించేలా వుంటుందని అన్నారు. గతంలో షూటింగ్‌ సమయంలో రిహార్సల్స్‌ జరిగేవని, కానీ ప్రస్తుతం ఆ పరిస్ధితి లేదన్నారు.

షణ్ముగం, బాలచందర్‌ లాంటి దర్శకులు శివాజీగణేషన్‌ లాంటి మహానటులు రిహార్సల్స్‌కు అధిక ప్రాధాన్యత ఇచ్చేవారని అన్నారు. ప్రస్తుతం తాము పనిచేస్తున్న ఈ చిత్రానికి సంబంధించి కొన్ని రోజులుగా రిహార్సల్స్‌ నిర్వహిస్తున్నామన్నారు. ఇలా రిహార్సల్స్‌ నిర్వహించడం ద్యారా ప్రేక్షకులకు మంచి చిత్రాన్ని అందించవచ్చని చెప్పారు. సమావేశంలో సంగీత దర్శకుడు దేవీశ్రీప్రసాద్‌ మాట్లాడుతూ... చిన్నతనం నుంచీ తాను కమల్‌ అభిమానినని, ఆయనతో కలసి పనిచేయడం మరచిపోలేని అనుభూతి అని అన్నారు. దశావతారం చిత్రానికి రీ-రికార్డింగ్‌ అందించానని తెలిపారు. తాను కంపోజ్‌ చేసే పాటలకు కమల్‌ డాన్స్‌ చేయడం తలచుకొంటే గర్వంగా వుందన్నారు. సమావేశంలో మాధవన్‌, సంగీత, కెమోరామేన్‌ మనుష్‌ నందన్‌ తదితరులు ప్రసంగించారు. తమిళంలో 'మన్‌మథన్‌ అంబు' పేరుతో నిర్మితమవుతున్న ఈ చిత్రం తెలుగులో కూడా ఒకేసారి విడుదల కానుంది. దీపావళికి చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు నిర్మాత ఉదయానిధి స్టాలిన్‌ పేర్కొన్నారు.
Category: 0 comments

No comments:

Pages