నానో టెక్నాలజీ అంటే ఏమిటి? ఆయుర్వేద వైద్యవిధానంలో నానో టెక్నాలజీ ఉందా? ఆయుర్వేద వైద్యవిధానాన్ని ఆవిష్కరించిన ప్రాచీనులకు ప్రపంచానికంటే ముందే నానోటెక్నాలజీ తెలుసా? - ఓ ప్రసిద్ధ వైద్య పాఠకుడు, చల్లపల్లి, కృష్ణాజిల్లా.

తిరోగమన దృష్టితో చూసి వర్తమాన ఆధునికతను ప్రాచీన భారతీయతకు ముడిపెట్టడం భారతదేశంలో విజ్ఞానశాస్త్ర ప్రగతికి ఒక అడ్డంకి. 'మా తాతలు నేతులు తాగారు. కావాలంటే మా మూతులు వాసన చూడండి' అన్నట్టే మనం నేడు చూస్తున్న నానోటెక్నాలజీ మన పురాతన జేజి నాన్నలకు తెలుసు. కావాలంటే ఆయుర్వేద కల్వాలు, పొత్రాలు చూడండి అంటున్న వారే భారతదేశంలో నానోటెక్నాలజీ అభివృద్ధికి అవరోధకులు. అంతర్గత దహనయంత్రం Internal combustion engine) గురించి ఇంకా ప్రపంచానికి తెలీకముందే మన దేశంలో వాయురథాలుండేవని, రావణాసురుడు వాడిన పుష్పకవిమానం అలాంటిదేనని కొందరు వాదిస్తారు. ఈ వాదనలు పామరులు చేస్తే అర్థం చేసుకోగలం. విశ్వవిద్యాలయస్థాయి మేధావులు, సమాజంలో నిర్ణాయక పాత్రగల అధికారులు ఇలాంటి మాటలు అనడం కద్దు. కానీ త్రేతాయుగం కన్నా ఆధునికం అయిన ద్వాపర యుగంలో రావణాసురుడి కంటే మహిమాన్వితుడు, శక్తిశాలి అయిన కృష్ణుడు కురుక్షేత్ర యుద్ధంలో అలాంటి వాయు రథాల ద్వారా యుద్ధం చేసి ఉంటే రెండ్రోజుల్లోనే శిష్టరక్షణ, దుష్ట శిక్షణ ముగిసేది. లేదా రుక్మిణిని రాక్షస వివాహం చేసుకొనడానికి అశ్వారూఢమైన రథానికి బదులు గాల్లో లేచే విమానంలో తీసుకెళ్ళి ఉండవచ్చును. విమానాల్లో ఇంధనాలు లేకుండా గాల్లోకి నెట్టగల మహిమాన్వితులు, రాత్రిళ్లుకాగానే తైల ఇంధనాల దీపాల గుడ్డి వెలుతురులో సంస్థానాల్ని, రాజప్రాసాదాల్ని, శయనాగారాల్ని అలంకరించారు. పొంతనలేని వాదనలతో అక్షరాలకు పూర్వమే గ్రంథ రచనలను, కూనిరాగాలు తీయలేని దశలో సంగీత గోష్టులను, బంతి, బ్యాటు రూపొందని కాలంలోనే క్రికెట్ మ్యాచ్‌లను, పరమాణు ఊహరాక మునుపే అణువు అంతర్నిర్మాణాన్ని, చంద్రుడు, సూర్యుడు గ్రహాలు అనుకుంటున్న అజ్ఞానపుటంంధకార ప్రపంచంలోనే బ్లాక్‌హోల్స్ పరిజ్ఞానాన్ని, మిల్లీమీటరును కూడా కొలవగల సామర్థ్యం లేని పరికరాల పరిజ్ఞాన పరిణితిగల సమాజంలో నానోటెక్నాలజీ విజ్ఞానాన్ని ఆపాదించి అభాసుపాలవుతున్నాము.

ఆయుర్వేద విధానంలో ఔషధాలలో నూరడం వల్ల నానోమీటరు సైజుగల కణికలు రావడం వాస్తవమే కావచ్చు. ఆ సైజు నానోమీటరులో ఉండడం వల్లనే ఆ మందుకు రోగనివారణ శక్తి సంభవించి ఉండవచ్చును. అయితే ఈ ప్రాచీన చికిత్సా విధానం అనుభవసారంగా (out of experience) వచ్చిన మెళకువల మేళవింపు మాత్రమే. వంట బాగా చేసే వారందరికీ కార్పొహైడ్రేట్లు జల విశ్లేషణ (hydrolysis of carbohydrates) చెందడం వల్లే బియ్యంలోని పెద్ద పాలీశాకరైడు అణువులు చిన్న చిన్న ఒలైగోశాకరైడులు అవుతున్నాయన్న పరిజ్ఞానం కూడా ఉందనడం సబబు కాదు. మాంసం, పప్పు వంటి పదార్థాలు బాగా ఉడకాలంటే ఉప్పువేయకుండా ఉడికించితే మంచిదని మా అమ్మ నాకు చిన్నప్పుడే నేర్పించింది. కానీ ఆమె నిరక్షరాసి. మా తల్లిదండ్రులు శ్రామికులు కావడం వల్ల వారికి ఆహారం నేనే చేసేవాణ్ణి. చిన్నప్పుడే వంట బాగా నేర్చుకొన్నాను. కానీ పప్పు, మాంసం ఉప్పు సమక్షంలో ఎందుకు త్వరగా ఉడకవో నాకు దీ.ూష డిగ్రీస్థాయిలో రసాయనిక శాస్త్రంలోని ఉష్ణగతిక శాస్త్రము (Thermodynamics), చర్యాగతిక శాస్త్రము (kinetics) నేర్చుకొనేంతవరకు అర్థం కాలేదు. అలా కాకుండా మా తల్లికి, చిన్నప్పుడే నాకు ఈ శాస్త్రాలన్నీ తెలుసు అని మా సోదరీ సోదరులు (siblings) వాదిస్తే మీరు ఆమోదిస్తారా? అలాంటి వాదనలే ఈ ప్రాచీన వైద్యవిధానాల్లోనే ఆధునిక విజ్ఞానశాస్త్ర ఒరవడులు ఆనాడే తెలుసుననే స్వోత్కర్షలు.
మీరు గానీ, జనవిజ్ఞానవేదికలో మేము గానీ, అభ్యుదయవాదులెవరు గానీ ప్రాచీన భారతదేశపు విజ్ఞాన వారసత్వాల్ని తక్కువ చేసి చూడము. ప్రపంచంలో చాలా దేశాల కన్నా ముందే మనం అనేక విషయాలలో అగ్రభాగాన ఉండేవారము. ఖగోళశాస్త్రాలకు, గణిత పద్ధతులకు, పాదార్థిక పరిజ్ఞానానికి, నీటి తీరువా విధానాలకు, వైద్య పద్ధతులకు ఆయా కాలాల్లో భారతదేశపు వైజ్ఞానికులు అద్భుతమైన నేర్పును ప్రదర్శించారు. అయితే ఆ విజ్ఞానాన్ని ఆరోగ్యకరంగా ఎదగనీయకుండా ఫ్యూడల్ విధానాలు, ఛాందసభావాలు, బ్రిటిష్ పరతంత్రపాలన అడ్డుకొన్నాయి. మరోవైపు పారిశ్రామికీకరణ ద్వారా ఆధునిక విజ్ఞానానికి పాశ్చాత్యులు పెద్దపీట వేశారు. కార్యకారణ సంబంధం (cause and effect) లేకుండా ఏ వైద్యవిధానమూ మహిమాధారంగా పనిచేయదు అన్న వాస్తవాన్ని అందరం గహ్రించాలి. విజ్ఞాన సాంకేతిక శాస్త్రాలు పిండోత్పత్తిలోని దశల్లోలాగానే క్రమానుసారంగా పరిణామం చెందాయి. పెంటియం 4 ప్రాసెసర్‌కు ముందే కోర్ 2- డ్యుయో ప్రాసెసర్‌ను రెండవ శతాబ్దంలో భారతీయులు వాడారంటే ఎలా? ఇంటెల్ వాళ్లకే కోర్-2 డ్యుయోను పెంటియం-4కు కొనసాగింపుగా మెరుగులు దిద్దారు. ఫలదీకరణం జరగక ముందే తల్లిగర్భంలో శిశువును, ఆ తర్వాత ఫలదీకరణాన్ని ఎలా ఊహించగలము? ఆయుర్వేదమైనా, యూనాని అయినా, హోమియో అయినా, ఆలోపతి అయినా మిగిలిన ఏ పద్ధతులయినా మార్పును ఆహ్వానించే విధంగా ప్రగతికి బాటలు వేయాలి. పరిశోధనకు ప్రాధాన్యతను ఇవ్వాలి. మిల్లీమీటరును కొలవలేని పరికరాలు వాడకుండా ఫలాని విషయం నానోమీటరులో జరుగుతోందని ఎలా గ్రహించగలరు? ఆధునిక నానో టెక్నాలజీ శాస్త్రవేత్తలు ఆధునికమైన STEM (scanning tunneling electron microscope), XRD (x-Ray Diffraction), AFM (Atomic Force Microscope) వంటి కోట్లాది రూపాయల విలువైన పరికరాలు వాడుతూ నానో టెక్నాలజీ విషయాలను గ్రహించగలిగారు. ఆ పరికరాలు లేకుంటే ఎవరికీ నానోటెక్నాలజీ విషయాలు అర్థం కావు. మరి ఇటువంటి పరికరాలు ఏవీ వాడకుండానే, ఇటువంటి ప్రయోగాలు ఏవీ చేయకుండానే ప్రాచీన కాలంలో ఆయుర్వేద వైద్యులకు నానోటెక్నాలజీ గురించి పరిపూర్ణ విజ్ఞానం ఉందనడం ఎంతవరకు ఆమోదనీయం?
ఎందువల్ల ఫలానా ఔషధం, ఫలాని రోగాన్ని నివారిస్తుందో కార్యకారణ సంబంధాన్ని కనుగొనాలి. అంతుచిక్కని సందిగ్ధాన్ని ప్రశ్నించే స్వేచ్ఛనివ్వాలి. ప్రశ్న అనేది విజ్ఞానశాస్త్ర ప్రగతికి పెద్దబలం. ఆ మధ్య ప్రపంచ ప్రఖ్యాతి చెందిన జీవశాస్త్రవేత్త, సిసియంబి వ్యవస్థాపక డైరెక్టర్ డా|| పి.ఎం.భార్గవ ఒక వైజ్ఞానిక సభలో ఓ సహేతుకమైన ప్రశ్నను హోమియో వైద్య విధానాన్ని ఉద్దేశించి వేశారు. ఆ ప్రశ్నలో వైజ్ఞానిక శాస్త్రపు కుతూహలమే తప్ప మరే దురుద్దేశమూ లేదు. కానీ ఆయన ఇంటిమీదకి వెళ్లి కొందరు హోమియో విద్యార్థులు, వైద్యులు దాడి చేశారు. ఇలాంటి దుందుడుకు వ్యవహారాలకు స్వస్తి చెప్పి, సశాస్త్రీయ పరిశోధనలకు తావిస్తే సాంప్రదాయ వైద్యవిధానాలు ఆధునిక ఒరవడుల స్పర్శతో అభివృద్ధి చెందగలవు.