'వ్యూహాత్మక' వలపక్షం!

 

అగ్ర రాజ్యమైన అమెరికా ధోరణి ఒక్కొక్కసారి విస్మయానికి గురి చేస్తూ ఉంటుంది.ఉపఖండంలో భారత్‌,పాక్‌లు రెండూ తమకు మిత్ర దేశాలేననీ, వ్యూహాత్మకంగా భాగస్వామ్య దేశాలని పదే పదే ప్రకటించే అమెరికన్‌ పాలకులు ఆయుధ, ఆర్థిక సహాయం అందించే విషయంలో పాక్‌ పట్ల వలపక్షం చూపుతున్నారన్న అభిప్రాయం భారతీయుల్లో నెలకొంది. అమెరికా ప్రకటనలే కాదు, చర్యలు కూడా ఇందుకు నిదర్శనం. భారత్‌ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న దేశమనీ, ఆసియాలో బలమైన స్థానాన్ని సంపాదించుకుందని ఒక వంక మన దేశంపై ప్రశంసల వర్షం కురిపిస్తూనే, మరో వంక పాకిస్థాన్‌కి పెద్ద ఎత్తున ఆయుధ, ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది.ఆఫ్ఘనిస్థాన్‌ నుంచి పాక్‌లోని వాయవ్య సరిహద్దు రాష్ట్రంలోకి వచ్చి పడుతున్న తాలిబన్‌, అల్‌ఖైదా ఉగ్రవాదులను ఎదుర్కోవడం కోసమే ఈ సహాయాన్ని అందిస్తున్నట్టు చెబుతూ ఉంటుంది. ఈ సహాయాన్ని పాక్‌ దుర్వినియోగం చేస్తోంది.మన దేశంపైకి జిహాదీల పేరిట ఉగ్రవాదులను ఉసిగొల్పేందుకు, వారికి సాయుధ శిక్షణ ఇప్పించేందుకు ఈ సహాయాన్ని పాక్‌ వినియోగిస్తున్నట్టు వచ్చిన కథనాల్లో అసత్యం లేదని పాక్‌ మాజీ అధ్యక్షుడు, మాజీ సైనిక పాలకుడు పర్వేజ్‌ ముషార్రఫ్‌ స్వయంగా అంగీకరించారు. అయినప్పటికీ, ఉగ్రవాదులను ఎదుర్కోవడానకి పాక్‌కి సహాయం తప్పని సరి అని అమెరికా పేర్కొనడం ఆ దేశం పట్ల అమెరికన్‌ పాలకుల పక్షపాత ధోరణికి నిదర్శనం. రిపబ్లికన్‌ పార్టీ నాయకుడు, మాజీ అధ్యక్షుడు అయిన జార్జి బుష్‌ అయితే, పాక్‌ని ఉగ్రవాదంపై పోరులో భాగస్వామ్య దేశంగా పరిగణిస్తున్నట్టు తరచు ప్రకటించేవారు. అసలు ఉగ్రవాదానికి పుట్టినిల్లు పాకిస్థానేనన్న సంగతి ప్రపంచ దేశాలకు తెలుసు. ఉగ్రవాదంపై పోరులో పాక్‌ని భాగస్వామిగా చేసుకుంటామని ఆయన అనగానే అందరూ విస్మయాన్ని ప్రకటించారు. ఇప్పుడు అమెరికాలో అధ్యక్షునిగా డెమోక్రాటిక్‌ నాయకుడు బరాక్‌ ఒబామా వ్యవహరిస్తున్నప్పటికీ,పాక్‌ని బుజ్జిగించే విషయంలో ఇరువురి మధ్య తేడాలేదని రుజువు చేస్తున్నారు.
భారత్‌తో తొలి వ్యూహాత్మక చర్చలను అమెరికా గురువారంనాడు వాషింగ్టన్‌లో ప్రారంభించింది. ఈ వ్యూహాత్మక చర్చలకు భారత్‌ తరఫున విదేశాంగ మంత్రి ఎస్‌ఎం కృష్ణ, అమెరికా తరఫున ఆ దేశపు విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్‌ నేతృత్వం వహిస్తున్నారు. ఈ చర్చల సరళిని బట్టి అమెరికా మన దేశం పట్ల అపారమైన గౌరవాన్ని ఒలకబోస్తున్నప్పటికీ,సహాయం విషయంలో మాత్రం పెద్దగా చొరవ తీసుకోవడం లేదనిపిస్తోంది. జార్జి బుష్‌ చేసిన యుద్ధం వల్ల ఆఫ్ఘనిస్థాన్‌ సర్వనాశనం అయింది.దాని పునర్నిర్మాణం కోసం ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల మాదిరిగానే మన దేశం కూడా సాయం అందిస్తోంది. అక్కడ రోడ్లు, వంతెనల పునర్నిర్మాణం,ఇతర నిర్మాణాల్లో పాలు పంచుకోవడానికి వెళ్ళిన భారత ఇంజనీర్లు, ఉద్యోగులు పలువురు ఇప్పటికే తాలిబన్ల దాడిలో ప్రాణాలు కోల్పోయారు. అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ సేనలో ఎంతో మంది మరణించారు. స్వదేశీయులతో పాటు విదేశీయులకు భద్రత కల్పించడం ఆఫ్ఘన్‌ పాలకులకు పెను సవాల్‌గా తయారైంది. ఆఫ్ఘన్‌ అధ్యక్షుడు హమీద్‌ కర్జాయ్‌ని లక్ష్యంగా చేసుకుని తాలిబన్లు ఇప్పటికీ దాడులు జరుపుతూనే ఉన్నారు.తాజాగా రెండు రోజుల క్రితం కర్జాయ్‌పై దాడి జరిగింది.ఈ దాడి నుంచి ఆయన తప్పించుకున్నప్పటికీ పలువురు గాయపడ్డారు. ఆఫ్ఘన్‌ పరిణామాల ప్రభావం పాక్‌ మీద పడుతున్న మాట నిజమే అయినా, ఆ సాకుతో పాక్‌కి అమెరికా అందిస్తున్న సాయం ఎన్నో రెట్లు పెరిగింది.ఏడాదికి 1.5 బిలియన్‌ డాలర్ల వంతున ఐదేళ్ళ పాటు సాయం అందించనున్నట్టు అమెరికా అధ్యక్షుడు ఒబామా ప్రకటించారు.ఆయుధాల విషయానికి వస్తే అమెరికా అందించే ఎఫ్‌ 16 విమానాల వంటి అత్యంత ఆధునికమైన ఆయుధాలే కాక,పాక్‌ స్వయంగా అణ్వస్త్రాలను సమకూర్చుకున్నది. అణ్వస్త్రాల సేకరణలో భారత్‌ కన్నా పాక్‌ ఎన్నో రెట్లు ముందు ఉందని స్టాక్‌ హోం ఇంటర్నేషనల్‌ పీస్‌ రిసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ పేర్కొంది. పాక్‌ వద్ద ప్రస్తుతం 60 వార్‌హెడ్‌లు ఉన్నాయనీ,అతి స్వల్ప వ్యవధిలో వంద పైగా అణ్వస్త్రాలను తయారు చేయగల సామర్ధ్యం పాక్‌కి ఉందని ఆ సంస్థ పేర్కొంది. తాము అందించే ఆయుధాలను భారత్‌పై పాక్‌ ప్రయోగించబోదని అమెరికా గట్టిగా విశ్వసించడమే కాకుండా మనలను కూడా నమ్మమంటోంది.
పాక్‌ కూడా ఉగ్రవాద బాధిత దేశమేనంటూ సన్నాయి నొక్కులు నొక్కుతోంది. అమెరికన్‌ నాయకుల ప్రకటనలను బట్టి తాలిబన్‌, అల్‌ఖైదాలు మాత్రమే ఉగ్రవాద సంస్థలన్నట్టుగా కనిపిస్తోంది. వాస్తవానికి ఈ రెండు ఉగ్రవాద సంస్థల కన్నా, పాక్‌ కేంద్రంగా పని చేస్తున్న లష్కర్‌ ఎ తోయిబా, జైష్‌ ఎ అహ్మద్‌ వంటి సంస్థల సభ్యులు జిహాదీల పేరిట భారత్‌లోకి చొరబడి మారణకాండను సృష్టిస్తున్నారన్న వాస్తవాన్ని అమెరికా ఉద్దేశ్య పూర్వకంగా విస్మరిస్తోంది.ఉగ్రవాదుల బెడద ఆఫ్ఘనిస్థాన్‌ నుంచి మాత్రమే ఉందని నమ్ముతోంది. ఆక్రమిత కాశ్మీర్‌లో లష్కర్‌, జైష్‌ సంస్థలు నిర్వహించే శిక్షణ శిబిరాల గురించి కనీసం ఒక్క సందర్భంలో కూడా అమెరికన్‌ నాయకుల నోటంట వెలువడలేదు. ఇవన్నీ పరిశీలిస్తే ఇరుగుపొరుగు దేశాల పట్ల పక్షపాతం చూపడమే అమెరికా వ్యూహాత్మకమేమోనని ఎవరికైనా అనిపించడం అత్యంత సహజం. ఆయుధాల దుర్వినియోగం జరుగుతోందని పాక్‌ మాజీ అధ్యక్షుడే స్వయంగా అంగీకరించిన తరువాత ఆ దేశానికి ఇంకా ఆయుధాలు సరఫరా చేయడం కూడా వ్యూహాత్మకమేనని అనుకోవాలా? మన దేశంపై ప్రశంసలు కురిపిస్తూ, పాక్‌కి దండిగా ఆయుధాలు,ఆర్థిక సాయం అందించడం కూడా అమెరికా వ్యూహాత్మకమనే అనుకోవాలా? వ్యూహాత్మకం పేరిట వర్ధమాన దేశాలను అమెరికా బుట్టలో వేస్తోందన్న వామపక్షాల వ్యాఖ్యల్లో అణుమాత్రం అసత్యం లేదని స్పష్టమవుతోంది. అగ్ర రాజ్యం కనుక తాను ఏం చెప్పినా,ఏం చేసినా చెల్లుతుందనేమో మొండివైఖరి కళ్ళకు కడుతోంది.
Category: 0 comments

No comments:

Pages