శ్రీహరి 'భైరవ' ప్రారంభం

 షో

యాక్షన్‌ ఓరియెంటెడ్‌ చిత్రాలు శ్రీహరికి ఎంతోపేరు తెచ్చిపెట్టాయి. ఇప్పుడు అదే తరహా కథాంశంతో ఆయన కథానాయకుడిగా 'భైరవ' చిత్రం రూపొందుతోంది. విశాఖ టాకీస్‌ పతాకంపై నిర్మాత నట్టికుమార్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీనిద్వారా చిత్ర పరిశ్రమలో పలువురు ప్రముఖ దర్శకుల వద్ద శిష్యరికం చేసిన పోలూరి శ్రీనివాసరెడ్డి (గులాబి) దర్శకుడిగా పరిచయమవుతున్నారు. శుక్రవారంనాడు హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోస్‌లో ఈ చిత్ర షూటింగ్‌ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ''తప్పు చేసిన వాడిని చంపడం తప్పు అయితే ఆ తప్పును లక్షసార్లు అయినా చేస్తాడు ఈ భైరవ'' అంటూ శ్రీహరి చెప్పిన డైలాగును ముహూర్తపు సన్నివేశంగా చిత్రీకరించారు. ఈ సన్నివేశానికి మాజీ కేంద్రమంత్రి డాక్టర్‌ దాసరి నారాయణరావు క్లాప్‌ నివ్వగా, హీరో జూనియర్‌ ఎన్‌.టి.ఆర్‌. కెమెరా స్విచ్చాన్‌ చేశారు. ప్రసాద్‌ సంస్థల అధినేత రమేష్‌ప్రసాద్‌ గౌరవ దర్శకత్వం వహించారు. హీరో రాజశేఖర్‌, నటుడు, దర్శకనిర్మాత ఆర్‌.నారాయణమూర్తి, దర్శకులు వీరశంకర్‌, భరత్‌, చంద్రమహేష్‌, దేవిప్రసాద్‌ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శ్రీహరి మాట్లాడుతూ, 'నట్టికుమార్‌ను కొందరు తక్కువగా అంచనావేశారు. కానీ అతను సమర్థుడైన నిర్మాత. నా 'దాసన్నా' సినిమాను 150 ప్రింట్లతో విడుదలచేసి, సక్సెస్‌ చేశారు. దానిద్వారా తాను మాటల మనిషిని కాదు, చేతల మనిషిని అని అతను నిరూపించుకున్నారు. విభిన్నమైన యాక్షన్‌ కథాంశంతో రూపొందుతున్న చిత్రమిది. దీనికి సంబంధించిన కథాచర్చలు మా ఇంట్లో జరుగుతున్నప్పుడు ఇందులో బాలనటుడి పాత్రను ఎవరిచేత చేయిద్దామా? అని అనుకుంటున్నప్పుడు నా రెండవ కుమారుడు మేఘాంశ్‌ నేను చేస్తానని ఎంతో ఉత్సాహాన్ని కనబరిచాడు. ఆ మేరకు ఈ చిత్రం ద్వారా మేఘాంశ్‌ బాలనటుడిగా పరిచయమవుతున్నాడు' అని అన్నారు.
అతిథిగా విచ్చేసిన ఆర్‌.నారాయణమూర్తి మాట్లాడుతూ, కృష్ణ మాదిరిగా నిర్మాతలను ఆదుకునే మంచి మనిషిగా శ్రీహరికి పేరున్నదని, అలాగే నట్టికుమార్‌ కష్టపడి ఈ స్థితికి వచ్చారని, వారి కలయికలో రూపొందుతున్న ఈ చిత్రం విజయవంతం కావాలని ఆకాంక్షించగా, నేటి నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ను మొదలుపెట్టి, సింగిల్‌ షెడ్యూల్‌లో ఈ చిత్రాన్ని పూర్తిచేస్తామని నిర్మాత నట్టికుమార్‌ అన్నారు. ఆగస్టు 15న శ్రీహరి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని, ఆగస్టు 12న ఈ సినిమాను విడుదల చేస్తామని ఆయన పేర్కొనగా, తనకు లభించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని దర్శకుడు పోలూరి శ్రీనివాసరెడ్డి చెప్పారు. సంగీత దర్శకురాలు శ్రీలేఖ మాట్లాడుతూ, యాక్షన్‌ చిత్రం కాబట్టి ఇందులో రీరికార్డింగ్‌కు మంచిస్కోప్‌ ఉన్నదని అన్నారు.
ఇంకా ఈ చిత్రంలో తనికెళ్ళ భరణి, రంగనాథ్‌, జీవా, సుప్రీత్‌ (కాటరాజ్‌), పృథ్వీ తదితరులు తారాగణం.
ఈ చిత్రానికి కథ, మాటలు: స్వామీజి, విజయ్‌, ఛాయాగ్రహణం: జస్వంత్‌, ఫైట్స్‌: కనల్‌ కణ్ణన్‌, ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: ఉదయకుమార్‌, నిర్మాణ సారథ్యం: నట్టి లక్ష్మీకరుణ, సమర్పణ: మాస్టర్‌ నట్టిక్రాంతి, నిర్మాత: నట్టికుమార్‌, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: పోలూరి శ్రీనివాసరెడ్డి (గులాబి).Category: 0 comments

No comments:

Pages