ముస్తాబవుతున్న 'బ్రహ్మలోకం టు యమలోకం'

 show
  • Bookmark and Share
  • Email Email
  • Print Print
రాజేంద్రప్రసాద్‌, శివాజీల పేర్లు చెప్పగానే చక్కటి హాస్య చిత్రాలు గుర్తుకువస్తాయి. అలాగే వారి కలయికలో వచ్చిన చిత్రాలు సైతం ప్రేక్షకులను ఎంతగానో అలరింపజేశాయి. తాజాగా వారిద్దరూ కలసి నటించిన ఇంకో చిత్రం 'బ్రహ్మలోకం టు యమలోకం' (వయా భూలోకం). గోళ్ళపాటి నాగేశ్వరరావు దర్శకత్వంలో యుటోపియా ప్రొడక్షన్స్‌ సమర్పణలో లక్కీమీడియా పతాకంపై రూపేష్‌, బెక్కం వేణుగోపాల్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం లోగో ఆవిష్కరణ హైదరాబాద్‌, హైటెక్స్‌ వద్ద గల సరస్వతీ కళాపీఠంలో జరిగింది. అతిథిగా పాల్గొన్న అవధాని నాగఫణిశర్మ టైటిల్‌ లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దర్శక, నిర్మాతల కోరిక మేరకు ఈ చిత్రంలో రెండు పాటలు రాశానని అన్నారు. చిత్రం మంచి విజయాన్ని సాధించాలని ఆకాంక్షించారు.
హీరోలలో ఒకరైన శివాజీ మాట్లాడుతూ, 'బ్రహ్మ సతీమణి సరస్వతీదేవి కాబట్టి ఈ పీఠంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటుచేశాం. ఈ మధ్యకాలంలో ఈ తరహా సినిమాలు రాలేదు. ఈ సంస్థలో నేను చేస్తున్న నాలుగవ చిత్రమిది. శ్రీలేఖ మంచి సంగీతాన్ని అందించారు. రాజేంద్రప్రసాద్‌ అన్నయ్యతో కలసి చేసిన మూడవ చిత్రమిది. పూర్తి హాస్యప్రధాన చిత్రం. అవసరాన్ని బట్టి చిత్రంలో గ్రాఫిక్స్‌ ఉంటాయి' అని అన్నారు.
నిర్మాతలలో ఒకరైన రూపేష్‌ మాట్లాడుతూ, త్వరలో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని చెప్పగా, ఓ పదిహేను రోజుల్లో సినిమా ఆడియోను విడుదల చేసి, ఈ నెలాఖరుకు సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని మరో నిర్మాత బెక్కం వేణుగోపాల్‌ పేర్కొన్నారు. దర్శకుడు గోళ్ళపాటి నాగేశ్వరరావు మాట్లాడుతూ, ఇందులో బ్రహ్మశ్లోకం, అమ్మ పాటను నాగఫణిశర్మ రచించారని చెప్పారు. సోషియోఫాంటసీ చిత్రమిదని, బ్రహ్మ, యముడు, చిత్రగుప్తుడు, రంభ బ్రహ్మలోకం నుండి యమలోకం వెళుతూ భూలోకంలోకి వస్తారని, ఈ నేపథ్యంలో ఏం జరిగిందన్నది తెరపై చూడాల్సిందేనని అన్నారు. కాగా తాను తొలిసారిగా ఈ తరహా చిత్రం చేస్తున్నానని, నాగఫణిశర్మ రాసిన అమ్మపాట ఎంతో బాగుంటుందని సంగీత దర్శకురాలు శ్రీలేఖ తెలిపారు. ఈ చిత్రంలో రెండు మాస్‌ పాటలు కూడా ఉన్నాయని ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో ఇంకా కోడూరి శ్రీనివాసరావు, కొండవీటి రాజు తదితరులు పాల్గొన్నారు.
Category: 0 comments

No comments:

Pages