- నవంబర్‌లో భారత్ పర్యటనపై ఒబామా వ్యాఖ్య
- ద్వైపాక్షిక భాగస్వామ్యం ఉభయ తారకమని ప్రకటన
అమెరికా, భారత్‌లు ఉమ్మడి లక్ష్యాలనూ, ఆశయాలనూ, ప్రయోజనాలనూ కలిగి ఉన్న దృష్ట్యా ఇరుదేశాల మధ్య బంధం ఏనాటికీ తెగిపోకపోవడమే కాక, క్రమంగా మరింత బలపడగలదని ఆయన అన్నారు. భారత్ పర్యటనను తాను హృదయ పూర్వకంగా స్వాగతిస్తున్నానని అంటూ,చపాతీలు తినడం కోసం కాదని చలోక్తిగా అన్నారు. అమెరికా విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ ఇప్పటికే భారత్‌లో పర్యటించి వచ్చిన సంగతిని గుర్తు చేశారు.”ఇది తలతో పని ఉన్న వ్యవహారం మాత్రమే కాదు, హృదయంతో సంబంధం ఉన్నది’ అని ఆయన అన్నారు. ఇరుదేశాల మధ్య ఆర్థిక సంబంధాలు శరవేగంగా విస్తృతమవుతున్నాయని ఆయన అన్నారు. వ్యూహాత్మక భాగస్వామ్యంపై గల అపోహలూ, అనుమానాలను తొలగిస్తానని కూడా ఆయన చెప్పారు.అంగీకారం కుదిరిన అంశాలపైనే కాక, విభేదించే విషయాలూ, అనుమానాలు తలెత్తే అంశాలపై కూడా ఇరుదేశాల మధ్య చర్చలు జరగవలసి ఉందని ఆయన అన్నారు.
ఉగ్రవాదంపై తక్షణ,నిర్దిష్ట చర్యలు అవసరం
ఉగ్రవాదంపై తక్షణ, నిర్దిష్ట చర్యలు అవసరమని భారత్,అమెరికాలు పిలుపు ఇచ్చాయి. మొదటి వ్యూహాత్మక చర్చల అనంతరం ఇరుదేశాలూ ఒక సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. ఉగ్రవాదంపై పోరునకు సంపూర్ణ సహాయ,సహకారాలను అందిస్తామని అమెరికా మరోసారి హామీపడింది. ముంబై దాడుల సూత్రధారులకు తగిన శిక్ష పడేట్టు చూడటంలో భారత్‌కి సంపూర్ణ సహకారం అందిస్తామని హామీ ఇచ్చింది.
ఉగ్రవాదంపై ఇరుదేశాలు తమ అభిప్రాయాలను మార్పిడి చేసుకున్నాయనీ, భవిష్యత్‌లో అనుసరించవలసిన వ్యూహాల గురించిచర్చించాయని భారత విదేశాంగ మంత్రి ఎస్ ఎం కృష్ణ చెప్పారు. అమెరికా విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్‌తో తాను జరిపిన చర్చలు ఫలించాయనీ, భవిష్యత్‌లో ఇరుదేశాల మధ్య బంధం మరింత పెరగడానికి ఈ చర్చలు దోహదం చేస్తాయని ఆయన చెప్పారు. అణ్వస్త్రాల భద్రత, అణు ఇంధనం సరఫరా మొదలైన అంశాలపై అమెరికా తాను ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.
No comments:
Post a Comment