సోనియాతో నేదురుమల్లి భేటీ 'మార్పు'పై చర్చ

హైదరాబాద్‌
న్యూఢిల్లి, ఆంధ్రప్రభ న్యూస్‌బ్యూరో: సోనియాగాంధీతో రాష్ట్ర రాజకీయాల గూర్చి చర్చించాననీ, మార్పు ఆవశ్యకత గూర్చి చెప్పానని రాజ్యసభకు మరోసారి ఎన్నికైన మాజీ ముఖ్యమంత్రి నేదరుమల్లి జనార్దన్‌రెడ్డి తెలిపారు. రాజ్యసభకు తనను ఎంపిక చేసినందుకు సోనియాగాంధీకి కృతజ్ఞతలు తెలిపానని చెప్పారు. తన సతీమణి నేదురుమల్లి రాజ్యలక్ష్మితో పాటు జనార్దన్‌రెడ్డి మంగళవారం నాడు సోనియాగాంధీతో భేటీ అయ్యారు. అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, రాష్ట్ర రాజకీయాల గూర్చి, ఉత్పన్నమవుతున్న పరిణామాల గూర్చి, మార్పు ఆవశ్యకత గూర్చి ఆమెతో చర్చించానని ఆయన పేర్కొన్నారు. మార్పంటే ఎలాంటి మార్పు? పార్టీలో నాయకత్వం మార్పా? ప్రభుత్వంలోని నాయకత్వం మార్పా? ఎలాంటి మార్పు గూర్చి సోనియాగాంధీకి మీరు సూచించారని ఒక విలేఖరి ప్రశ్నించగా, పార్టీ ఆంతరంగిక విషయాల గూర్చి మీడియాకు వెల్లడించే అలవాటు తనకు లేదని నేదురుమల్లి జవాబును దాటవేశారు. సోనియాగాంధీ వద్ద దివంగత ముఖ్యమంత్రి సతీమణికి దొరకని అపాయింట్‌మెంట్‌ మీకు చాలా ఈజీగానే దొరికినట్టుందే? అని మరో విలేఖరి వ్యాఖ్యానించగా, తాను కృతజ్ఞతలు వెల్లడించేందుకు, తన కుమారుడి వివాహానికి ఆహ్వానించేందుకు అపాయింట్‌మెంట్‌ కోరడం జరిగిందనీ, రాజకీయాలు మాట్లాడననే నమ్మకం కుదరడంతోనే మేడం తనకు అపాయింట్‌మెంట్‌ ఇచ్చినట్టుందని ఆయన వివరణ ఇచ్చారు. ఇదిలాఉండగా, ఈ నెల 24న తమ కుమారుడి వివాహం జరగనుందనీ, వివాహానికి రావలసిందిగా సోనియాగాంధీని ఆహ్వానించామని నేదురుమల్లి రాజ్యలక్ష్మి చెప్పారు.
Category: 0 comments

No comments:

Pages