రాజీవ్‌ ప్రమేయంతోనే అండర్సన్‌ దేశం విడిచి వెశ్లారు

భోపాల్‌ కార్బైడ్‌ కంపెనీలో దుర్ఘటన జరిగిన తర్వాత ఆ కంపెనీ చైర్మన్‌ వారెన్‌ ఆండర్సన్‌ ఆనాటి ప్రధాని రాజీవ్‌ గాంధీ ప్రమేయంతోనే దేశం విడిచి వెళ్ళారని సిపిఐ జాతీయ కార్యదర్శి ఎబి బర్ధన్‌ ఆరోపించారు. శనివారం సిపిఐ రాష్ట్ర కార్యాలయం మగ్దూంభవన్‌లో ఆ పార్టీ జాతీయ కౌన్సిల్‌ సమావేశాలలో బర్ధన్‌ ప్రారంభోపన్యాసం చేశారు. భోపాల్‌ దుర్ఘటనలో భాద్యులను తప్పించేం దుకు పెద్ద కుట్రజరుగుతోందని ఆయన ఆరోపించారు. రాజీవ్‌ గాంధీ పేరు బయటకు రాకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం తంటాలు పడుతోందన్నారు. ఇందులో బలి ఇచ్చేందుకు బకరాలను వెదుకుతున్నా రన్నారు. ఆండర్‌ సన్‌ దేశం విడిచి వెళ్ళేందుకు మధ్యప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయి సరిపోదని, అందుకే ప్రధానే నేరుగా ఈ విషయంలో జోక్యంచేసు కొన్నారని ఆయన చెప్పారు. అందుకే రాజీవ్‌ పేరు బయటకు రాకుండా చూస్తున్నారన్నారు. బహుళ జాతి కంపెనీల ప్రయోజ నాలు కాపాడేందుకు ప్రభుత్వాలు ఎప్పుడూ ప్రయత్ని స్తూనే ఉంటాయన్నారు. వారిచ్చే ఆర్థిక ప్రయోజనాలకు ఇలాంటి పనులకు ప్రభుత్వాలు పాల్పడుతున్నాయని ఆయన విమర్శించారు. 20 వేల మంది ప్రాణాల ఖరీదును పాపం రూపంలో వారు మూటకట్టు కున్నారన్నారు. ఇందులో వాస్తవాలు ఎప్పుడైనా బయటికి రాకతప్పదన్నారు. భోపాల్‌ దుర్ఘటన నేపథ్యంలో ఇకపై ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు పరిహారం ఎక్కువగా కోరకుండా ఉండేందుకే కేంద్ర ప్రభుత్వం అణు పరిహార పరిమితి చట్టాన్ని చేసేందుకు ప్రయత్నిస్తోందన్నారు. ఈ చట్టాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. భోపాల్‌ దుర్ఘటనలో దోషిగా తేలిన ఆండర్సన్‌కు కేవలం రెండేళ్ళు జైలు శిక్ష విధించడం న్యాయ వ్యవస్థకే అవమానమన్నారు. ఈ కేసులో విచారణను ఎదుర్కొన్న కార్బైడ్స్‌ కంపెనీ చైర్మన్‌ ఆండర్సన్‌ తీర్పు అనంతరం ఇక్కడి ప్రభుత్వ అతిథి గృహంలో ప్రభుత్వ లాంఛనాలతో గడిపారన్నారు. ఆండర్‌సన్‌ ఉన్న అతిథి గృహం వద్దకు మెజిస్ట్రేట్‌ అక్కడికే పోయి బెయిల్‌ ఇచ్చారని, రెండేళ్ళు శిక్షకు గురయిన ఆయన రెండుగంటల్లోనే ప్రభుత్వం సమకూర్చిన విమానంలో అమెరికా వెళ్ళిపోయారన్నారు. ఆండర్‌సన్‌పై మన ప్రభుత్వాలకు ఎందుకంతా ప్రేమని ఆయన ప్రశ్నించారు. యుపిఏ ప్రభుత్వం -1 బలమైన వామపక్ష పార్టీల మద్దతుతో ఆధికారంలోకి వచ్చిందన్నారు. సిఎంపి ఆధారంగా ప్రభుత్వాన్ని ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా పనిచేయించగలిగా మన్నారు. వామపక్షాలు చేసిన పనుల వలన ప్రజలకు కల్గిన ప్రయోజనాలను ఉపయోగించుకొని పార్టీ ప్రయోజనాలకు ఎలాంటి చర్యలు చేపట్టలేకపోవడం వామపక్షాలు చేసిన తప్పుగా ఆయన పేర్కొన్నారు. యుపిఏ -2 అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా ప్రజలకు ఏమిచేయలేకపోయిందన్నారు. వారు ఘనంగా చెప్పుకోవడానికి కూడా ఏమి మిగలలేదన్నారు. ఆర్థిక సరళీకరణ, ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ వైపు అడుగులు వేసిందన్నారు. గతంలో వామపక్షాల మద్దతో ఉండగా ఇలాంటి సాహసాలకు యుపిఏ ప్రభుత్వం పాల్పడలే దన్నారు. వామపక్షాల అదుపు లేకపోవడంతో ప్రభుత్వం ఆ వైపుగా సాగుతోందన్నారు.
పశ్చిమ బెంగాల్‌లో స్థానిక ఎన్నికల్లో వచ్చిన చేదు అనుభవాలను వామపక్ష కూటమి లోతుగా విశ్లేషించు కోవాల్సివుందన్నారు. అక్కడ జరిగిన లోపాలు చిన్నవి కావన్నారు. అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నా యన్నారు. విధానపరమైన, రాజకీయపరమైన, ప్రభుత్వ పరంగా జరిగిన లోటుపాట్లకు సంబంధించి లోతుగా పార్టీలోనే విశ్లేషించుకోవాలన్నారు. అమెరికాలో తలెత్తిన ఆర్థిక సంక్షోభం వలన చైనా, భారత్‌ లాంటి దేశాలు అతలాకుతలం అయ్యాయన్నారు. సంక్షోభ ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా అన్నిదేశాల మీద పడిందన్నారు. ప్రపంచంలో పెట్టుబడిదారి వ్యవస్థ పేదరికంతో పాటు ఏ సమస్యకు పరిష్కారం చూపలేకపోయిందన్నారు. పెట్టుబడిదారి వ్యవస్థ సమస్యలకు అతీతం కాదన్నారు. ఒక్క సోషలిజంలోనే సమస్యలన్నింటికి పరిష్కారం ఉంటుందన్నారు.
Category: 0 comments

No comments:

Pages