తొలగిన 'ఏడుకోట్లు' సందేహాలు

రాష్ట్రీయం 



కదిరి (కె.ఎన్‌.ఎన్‌): నాకాబందిలో భాగంగా అనంతపురం జిల్లా కదిరి పోలీసులు స్వాధీనం చేసుకున్న రూ.7కోట్లపై సందేహాలు తొలగినట్లే. రెండు వాహనాలలో తరలిస్తున్న రూ.7కోట్లతోపాటు, వాహనాలను, తిరుపతికి చెందిన పేరం రామకృష్ణనాయుడు,సోంపల్లి వెంకటరమణ,డ్రైవర్లు బొల్లిపల్లి వెంకటేశ్వర్లు,జి.రామయ్యలను కదిరి పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. నగదును తరలిస్తున్న రెండు వాహనాలలో ఒక స్కార్పియో వాహనం తిరుపతికి చెందిన తెలుగుదేశం నాయకుడు పేరం హరిబాబుదిగా గుర్తించినట్లు పోలీసులు చెప్తుండగా స్థానిక డిఎస్పీ సుబ్బరాయుడు,టౌన్‌ సి.ఐ ఆంజనేయులు,నల్లమాడ సి.ఐ అశోక్‌కుమార్‌లు అదుపులోకి తీసుకొన్న వ్యక్తులను ప్రశ్నించడంతో నగదును కర్నాటక రాష్ట్రం హొస్పేట నుంచితిరుపతి తీసుకువెళ్తున్నట్లు తెలిపారు. బుధవారం అర్థరాత్రి పోలీసులు స్థానిక తహశీల్దార్‌ మోహన్‌ సమక్షంలో నగదు, వాహనాలను, నగదు తరలిస్తున్న వ్యక్తులను కోర్టులో హాజరుపరిచారు. పోలీసులు స్వాధీనం చేసుకొన్న వాహనాలలో 5వాకిటాకీలతోపాటు,5నంబర్‌ ప్లేట్లను పోలీసులు గుర్తించారు. గురువారం ఉదయం పోలీసులు వీరిని కోర్టులో హాజరుపరచగా నగదు పట్టుబడిన విషయంలో కేసునమోదు చేయడానికి పోలీసులు చెబుతున్న కారణాలు, చూపుతున్న ఆధారాలు పొంతనలేనివిగా వున్నాయంటూ న్యాయమూర్తి కేశవ్‌ తిరస్కరించారు. మరోవైపు వాహనాలలో తరలిస్తున్న నగదు పేరం హరిబాబుదిగా వ్యాఖ్యానాలు వినిపించగా ఆయన స్థానిక పోలీసు స్టేషన్‌కు చేరుకున్నారు. పోలీసుల అభియోగాలతో రిమాండ్‌కు పంపలేమని న్యాయమూర్తి తేల్చిచెప్పారు. గురువారం ఉదయమే టిడిపి నాయకుడు హరిబాబు నగదు తనది కాదని తన స్నేహితులు ప్రకాష్‌,బస్వరాజులు హొస్పేట నుంచి తిరుపతికి టిప్పర్ల కొనుగోలుకు ఇతర యంత్రాల కొనుగోలు నిమిత్తం తరలిస్తున్నట్లు ప్రకటించగా ఆయన స్నేహితులు హొస్పేట బ్యాంకు నుంచిడ్రాచేసిన వివరాలను కోర్టుకు సమర్పించడంతో రిమాండ్‌కు పంపాల్సిన అవసరంలేదని న్యాయమూర్తి తేల్చిచెప్పారు. ఈ విషయయమై తెలుగుదేశం నాయకుడు హరిబాబు కోర్టు ఆవరణలో విలేఖరులతో మాట్లాడుతూ నగదు తరలింపుపై కొందరు రాజకీయంగా బురదచల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తన స్నేహితులు తన కారును వాడుకున్నారు తప్ప, నగదుకు తనకు సంబంధం లేదన్నారు. ఒక టివి చానల్‌ పనిగట్టుకొని ప్రచారం చేసినట్లు ఆరోపించారు. వాహనాలలో పట్టుబడిన నంబర్‌ ప్లేట్లు గతంలో చంద్రబాబుకు పెట్టిన కాన్వాయ్‌లోని నంబర్లుగా ఆయన పేర్కొంటూ వి.ఐ.పిల భద్రత విషయంలో నంబర్‌ ప్లేట్లను మార్చడం సాధారణ విషయంగానే ఆయన పేర్కొన్నారు.
Category: 0 comments

No comments:

Pages